నవపక్షం, నాంపల్లి, సెప్టెంబర్ 15:
నాంపల్లి రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ (National Mission on Natural Farming – NMNF) పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు ప్రకృతి వ్యవసాయం ముఖ్య ఉద్దేశాలు, సూత్రాలు, ప్రయోజనాలను రైతులకు వివరించారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గిస్తూ, స్థానికంగా లభించే వనరులను ఉపయోగించుకుని తక్కువ పెట్టుబడితో పర్యావరణహితంగా, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించాల్సిన అవసరాన్ని వివరించారు.
ప్రకృతి వ్యవసాయంలో నేల ఆరోగ్య పరిరక్షణ, జీవ వైవిధ్యం, తేమ సంరక్షణ, సహజ పద్ధతుల్లో చీడపీడల యాజమాన్యం, అలాగే ప్రకృతి వ్యవసాయ ఇన్‌పుట్‌ల తయారీ, వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు.
ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు ఖర్చులను తగ్గించడంతో పాటు నేల సారాన్ని మెరుగుపరచి, పర్యావరణ పరిరక్షణకు దోహదపడవచ్చని అధికారులు తెలిపారు. రైతులు తమ ప్రాంతీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను క్రమంగా అవలంబించాలని సూచించారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ లక్ష్యాల సాధనలో రైతుల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నాంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ నక్క చంద్రశేఖర్, మండల వ్యవసాయ అధికారి బండారు శివ, వ్యవసాయ శాఖ అధికారులు, ఏఈఓలు, వార్డు సభ్యులు, రైతులు, ఇతర సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.


