నవపక్షం, బచ్చన్నపేట మండల ప్రతినిధి :
ఇటీవల కురిసిన భారీ వర్షానికి బసిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన పుప్పాల పద్మ, భర్త రాములు కుటుంబానికి చెందిన ఇల్లు కూలిపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇల్లు పూర్తిగా దెబ్బతినడంతో కుటుంబానికి ప్రస్తుతం సురక్షితమైన నివాసం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.
కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉండటంతో సొంతంగా ఇల్లు నిర్మించుకునే పరిస్థితి లేకపోవడంతో వారి ఇబ్బందులు మరింత తీవ్రమయ్యాయి. అదేవిధంగా కుటుంబంలోని కుమారుడి మానసిక పరిస్థితి కూడా సరిగా లేకపోవడంతో కుటుంబ పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు కుటుంబ పరిస్థితిని మానవతా దృక్పథంతో పరిశీలించి, తక్షణ సహాయంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.
వర్షం, ఎండ, చలి వంటి ప్రతికూల పరిస్థితుల నుంచి కుటుంబాన్ని రక్షించేందుకు సురక్షితమైన శాశ్వత నివాసం కల్పించడం అత్యవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే గృహ నిర్మాణ పథకం ద్వారా ఈ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


