నవపక్షం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి :
బాలయ్యపల్లె అంగన్వాడీ సెంటర్లో పోషణ మాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ తోట్ల తిరుపతి యాదవ్, ఉప సర్పంచ్ పిండి ప్రభాకర్ యాదవ్, వార్డు మెంబర్ తోట్ల అశోక్ యాదవ్, పంచాయతీ సెక్రటరీ వేల్పుల సరిత హాజరయ్యారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ స్వప్న, ఆయా స్వప్న ఆధ్వర్యంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు, కిశోర బాలికలు, గ్రామ పెద్దలకు పోషకాహారంపై అవగాహన కల్పించారు.
ప్రత్యేకంగా చిరుధాన్యాల ప్రాధాన్యత, ఆకుకూరలలో ఉండే పోషక విలువలు, వివిధ విటమిన్ల అవసరం మరియు ఆరోగ్యానికి పోషకాహారం అందించే ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించాలని సూచించారు.
అనంతరం పోషణ, ఆరోగ్యం మరియు పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తూ పోషణ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు, కిశోర బాలికలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.


