నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 19:
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ 13వ వార్డులోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ సూచించారు.
శుక్రవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో భారీ వర్షం కురిసిన నేపథ్యంలో కౌన్సిలర్ వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. రాంనగర్, వినాయక నగర్, జయభూమి వెంచర్, వెంకటరమణ కాలనీల్లో పర్యటించి వర్షపు నీరు నిలిచిన ప్రాంతాలను పరిశీలించారు.
వరద నీరు సాఫీగా వెళ్లేందుకు అడ్డుగా ఉన్న చెట్లు, మట్టి కుప్పలు, చెత్తాచెదారం తదితరాలను వ్యక్తిగత సిబ్బందితో తొలగింపజేసి, నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా బత్తుల వాణి విప్లవ్ కుమార్ మాట్లాడుతూ, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వార్డు ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.
ప్రజల సమస్యల పరిష్కారం కోసం 24 గంటలు అందుబాటులో ఉంటానని, వరద నీరు లేదా వర్షాల కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తనను ఎప్పుడైనా సంప్రదించవచ్చని కౌన్సిలర్ తెలిపారు.


