నవపక్షం, శాలిగౌరారం మండల ప్రతినిధి :
శాలిగౌరారం మండల కేంద్రంలోని మార్కెట్ సెంటర్‌లో హెచ్ఐవి–ఎయిడ్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కళాజాతర కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో, జిల్లా ఆరోగ్యశాఖ అదనపు అధికారి డాక్టర్ శంకర్ గారి పర్యవేక్షణలో, డీపీఎంఓ సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా నల్లగొండకు చెందిన శ్రీ సాయి ఆర్ట్స్ అకాడమీ కళాకారులు కళాజాతర ద్వారా హెచ్ఐవి–ఎయిడ్స్ వ్యాప్తి, నివారణ చర్యలు, అపోహల నివృత్తిపై ప్రజలకు అవగాహన కల్పించారు. కళా ప్రదర్శన ద్వారా సందేశాలను అందించడంతో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
హెచ్ఐవి ప్రధానంగా నాలుగు మార్గాల ద్వారా వ్యాపించే అవకాశం ఉందని ప్రజలకు వివరించారు. అవి:
1. హెచ్ఐవి సోకిన రక్తాన్ని మార్పిడి చేయడం ద్వారా
2. కలుషితమైన సూదులు, సిరంజిలను ఉపయోగించడం ద్వారా
3. రక్షణలేని లైంగిక సంబంధాల ద్వారా
4. హెచ్ఐవి సోకిన తల్లి నుంచి బిడ్డకు సంక్రమించే అవకాశం ద్వారా
హెచ్ఐవి నివారణలో భాగంగా రక్షణలేని లైంగిక సంబంధాలను నివారించడం, అవసరమైన సందర్భాల్లో కండోమ్‌ను సరిగ్గా ఉపయోగించడం, సూదులు–సిరంజిలను పంచుకోకపోవడం వంటి జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
హెచ్ఐవి గురించి మరింత సమాచారం, సలహా కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1097ను సంప్రదించాలని, బ్రేక్‌ఫ్రీ యాప్ ద్వారా కూడా హెచ్ఐవి సంబంధిత సమాచారాన్ని తెలుసుకోవచ్చని ప్రజలకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో LWS తీగల గోవర్ధన్ పాల్గొన్నారు. అలాగే కళాబృందానికి చెందిన లింగస్వామి, రామకృష్ణ, పాపయ్య, జైకుమార్ తదితరులు పాల్గొని కళా ప్రదర్శన ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.


