నవపక్షం, గూడూరు ప్రతినిధి :
కోట మండలం గూడలి గ్రామంలోని స్వర్ణముఖి బ్రిడ్జి సమీపంలో ఇళ్ల వ్యర్థజలాల బహిరంగ విడుదలతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.నివాసం నుంచి పెద్ద పైపును బయటకు ఏర్పాటు చేసి,ఇంట్లో వినియోగించిన మురుగునీరు, బాత్రూం నీరు,బట్టలు ఉతికిన నురుగు నీరు తదితర వ్యర్థజలాలను రహదారి వైపు విడుదల చేస్తున్న దృశ్యం స్థానికంగా కనిపిస్తోంది.ప్రధాన రహదారి పక్కనే ఈ విధంగా వ్యర్థజలాలు చేరుతుండటంతో రోడ్డుపై ప్రయాణించే విద్యార్థులు, ఉద్యోగులు,సైకిల్,ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వాహనాలు వెళ్తే మురికి నీటి చిమ్ముర్లు!
రోడ్డుపై నీరు చేరి ఉండటంతో వాహనాలు ఆ మార్గంలో ప్రయాణించే సమయంలో చక్రాల కింద నుంచి మురికి నీరు చిమ్ముతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.దీంతో నడుచుకుంటూ వెళ్లేవారిపై, సైకిళ్లపై వెళ్లే విద్యార్థులపై,ద్విచక్ర వాహనదారులపై నీటి చిమ్ముర్లు పడుతూ బట్టలు మురికిమయమవుతున్నాయని వాపోతున్నారు.
ఇళ్లలో ఉత్పత్తయ్యే వ్యర్థజలాలను సరైన డ్రైనేజీ వ్యవస్థలోకి మళ్లించాల్సిన అవసరం ఉండగా,వాటిని పెద్ద పైపుల ద్వారా రహదారి వైపు విడుదల చేయడం వల్ల ప్రజా రహదారి పారిశుధ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.రహదారి పక్కనే మురుగు నీరు నిలిచిపోవడంతో బురద, దుర్వాసన,దోమల సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలు రాకపోకలు సాగించే రహదారిని ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థజలాల కోసం వినియోగించడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.ఒక ఇంటి నుంచి వచ్చే వ్యర్థజలాల కారణంగా ప్రతిరోజూ రహదారిపై ప్రయాణించే వందలాది మంది ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని అంటున్న
ఈ సమస్యపై పంచాయతీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి,వ్యర్థజలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి,వాటిని రహదారిపైకి ఎందుకు విడుదల చేస్తున్నారు అనే అంశాలను పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు.రహదారిపైకి మురుగునీరు రాకుండా ప్రత్యామ్నాయ డ్రైనేజీ ఏర్పాట్లు చేయడంతో పాటు,నిబంధనలకు విరుద్ధంగా వ్యర్థజలాలను బహిరంగంగా విడుదల చేస్తున్నట్లు నిర్ధారణ అయితే సంబంధిత వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రజలు నిత్యం ప్రయాణించే రహదారిపై మురుగునీరు ప్రవహిస్తూ ఉంటే ఇక పారిశుధ్యం,ప్రజల ఇబ్బందులపై ఎవరు బాధ్యత వహించాలి? ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్థలాన్ని పరిశీలించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విద్యార్థులు, ఉద్యోగులు,వాహనదారులు కోరుతున్నారు.


