నవపక్షం, సూర్యాపేట జిల్లా ప్రతినిధి :
కృషి విజ్ఞాన కేంద్రం (KVK), గడ్డిపల్లిలో నిర్వహించిన కిసాన్ మేళాలో భాగంగా వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో వివిధ వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్ ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ఎల్ నినో ప్రభావం, భూగర్భ జలాల లభ్యతలో తగ్గుదల వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి తీసుకురావాలని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు చేపట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, డీపీడీ నివేదిత, వ్యవసాయ అధికారి ప్రీతం, వ్యవసాయ సహాయ సంచాలకులు రవి కిసాన్ మేళాలో ఏర్పాటు చేసిన నిష్ట సీడ్స్ స్టాల్ను సందర్శించారు. కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి, సంస్థ అందిస్తున్న వివిధ విత్తన రకాలు, వాటి ప్రత్యేకతలు, పంటకాలం తదితర వివరాలను తెలుసుకున్నారు.
యాసంగి సీజన్లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని, రైతులకు అనుకూలమైన మెరుగైన విత్తన రకాలను అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యాజమాన్యానికి సూచించారు.
ఈ సందర్భంగా నిష్ట సీడ్స్ సేల్స్ ఆఫీసర్ సూర్య చంద్ర మాట్లాడుతూ, వరి పంటలో NS DHAAN-1 సన్న రకం, మొక్కజొన్నలో NS O421 రకాల ప్రత్యేకతలు, వాటి సాగుకు సంబంధించిన వివరాలను అధికారులకు వివరించారు.
కిసాన్ మేళా ద్వారా రైతులకు అందుబాటులో ఉన్న నూతన వ్యవసాయ సాంకేతికతలు, మెరుగైన విత్తన రకాలు, నీటి వనరుల సమర్థ వినియోగంపై అవగాహన కల్పించడం ద్వారా యాసంగి సాగులో సరైన పంట రకాలను ఎంపిక చేసుకునేందుకు దోహదపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.


