నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి :
విద్యార్థులకు పుస్తక పరిజ్ఞానంతో పాటు ఆచరణాత్మక అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో మర్రిగూడ తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థులు మాల్ లోని ట్రెండ్స్, మీ మార్ట్ విక్రయ కేంద్రాల్లో పది రోజులపాటు ఇంటర్న్షిప్ చేస్తున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఉయ్యాల వెంకటేశం మాట్లాడుతూ, తరగతి గదిలో నేర్చుకున్న సైద్ధాంతిక అంశాలను వాస్తవ పని ప్రదేశాల్లో అన్వయించుకోవడం ద్వారా విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యాలు పెంపొందుతాయని తెలిపారు. వస్తువుల అమరిక, నిల్వల నిర్వహణ, బిల్లుల తయారీ, విక్రయాల ప్రక్రియ, వినియోగదారులతో వ్యవహరించే విధానాలపై ఈ శిక్షణ ద్వారా ప్రత్యక్ష అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు. విద్యను ఉపాధితో అనుసంధానిస్తూ విద్యార్థులను భవిష్యత్తు ఉద్యోగావకాశాలకు సన్నద్ధం చేయడంలో ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని వివరించారు.
ఒకేషనల్ శిక్షకుడు వెంకటరమణ మాట్లాడుతూ, ఈ శిక్షణ విద్యార్థులకు పని అనుభవాన్ని అందించడంతో పాటు సమయపాలన, బాధ్యత, సంభాషణ నైపుణ్యాలు, బృంద స్ఫూర్తిని పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు, ట్రెండ్స్, మీ మార్ట్ విక్రయ కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.


