నవపక్షం , హైదరాబాద్ ప్రతినిధి :
నాదర్గుల్లోని ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో డాండియా వేడుకల సందర్భంగా భారీ అలంకరణ ఆర్చ్ కూలి విద్యార్థిని నారాయణదాసు సోనా (18) మృతి చెందడం, మరో 14 మంది విద్యార్థులు గాయపడటం తీవ్ర దిగ్భ్రాంతికరం. ఈ ఘటనలో మృతురాలి సోదరి మీనా కూడా తీవ్రంగా గాయపడటం బాధాకరం.
కళాశాల యాజమాన్యం భద్రతా ప్రమాణాలను పాటించడంలో నిర్లక్ష్యం వహించిందా అనే అంశంపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరిపి, బాధ్యులపై వర్తించే చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని BRSV రాష్ట్ర కార్యదర్శి డా. కొండ గణేష్ డిమాండ్ చేశారు.
ప్రధాన డిమాండ్లు:
1. మృతురాలి కుటుంబానికి రూ.2 కోట్ల ఎక్స్గ్రేషియా చెల్లించాలి.
2. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించి, చికిత్స ఖర్చులను భరించాలి.
3. ప్రమాదానికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
4. భద్రతా ఉల్లంఘనలు నిర్ధారణైతే కళాశాల గుర్తింపు రద్దు సహా తగిన చర్యలు చేపట్టాలి.
తెలంగాణ సంస్కృతి, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన విద్యాసంస్థల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు బాధితుల పక్షాన పోరాడుతామని డా. కొండ గణేష్ స్పష్టం చేశారు.


