నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో గ్రామపంచాయతీలు, గ్రామసభలకు ప్రాధాన్యత కల్పించకుండా ఎంపిక ప్రక్రియ కొనసాగిస్తున్నారని నాంపల్లి మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి,పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ తెలంగాణ భవన్లో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని కలిసి వివరించారు.
ఈ సందర్భంగా నాంపల్లి గ్రామ సర్పంచ్ నక్క చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో అర్హులైన పేదలను గుర్తించడంలో గ్రామపంచాయతీలు, గ్రామసభల పాత్ర కీలకమని, అయితే వాటి ప్రమేయం లేకుండానే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఎంపిక ప్రక్రియ కొనసాగించడం సరైన విధానం కాదన్నారు. అర్హులైన పేదలకు న్యాయం జరగాలంటే స్థానిక ప్రజాప్రతినిధులకు తగిన ప్రాధాన్యత, భాగస్వామ్యం కల్పించాలని కోరారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గ్రామపంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం 2024 అక్టోబర్ 11న జీఓ నంబర్ 33 జారీ చేసిందని, అప్పట్లో సర్పంచులు లేకపోవడంతో ప్రత్యేక అధికారులను కమిటీల చైర్మన్లుగా నియమించిందని సర్పంచులు వివరించారు. ప్రస్తుతం కొత్తగా ఎన్నికైన సర్పంచులకు, ముఖ్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచులకు కమిటీల వ్యవహారాల్లో తగిన ప్రాతినిధ్యం, సమాచారం కల్పించడం లేదని తెలిపారు.
ఈ నేపథ్యంలో జీఓ నంబర్ 33ను రద్దు చేసి, నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ఇందిరమ్మ ఇళ్ల కమిటీల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీఓ జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని కోరారు. దీనిపై స్పందించిన జగదీష్ రెడ్డి సర్పంచులు లేవనెత్తిన సమస్యపై న్యాయ నిపుణులతో సంప్రదించి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేలా తదుపరి కార్యాచరణ రూపొందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నాంపల్లి సర్పంచ్ నక్క చంద్రశేఖర్‌తో పాటు కడారి శ్రీశైలం యాదవ్, నడింపల్లి శ్రీలక్ష్మి యాదయ్య గౌడ్, సాగర్ల యాదయ్య, శోభ సహదేవ్, పెరికేటి రమేష్, కోరే దేవేంద్ర సైదులు, మంటిపెళ్లి మణిమాల శ్రీశైలం యాదవ్, పల్లె వెంకటేష్ గౌడ్ తదితర సర్పంచులు పాల్గొన్నారు.

