నవపక్షం, మర్రిగూడ, సెప్టెంబర్ 5:
మర్రిగూడలోని పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా భారతదేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పుతున్న ఉపాధ్యాయుల పట్ల గౌరవం, కృతజ్ఞతలను చాటుతూ శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేసి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఉయ్యాల వెంకటేశం మాట్లాడుతూ, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనదని అన్నారు. విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాలను బోధించడం మాత్రమే కాకుండా, వారిలో క్రమశిక్షణ, నైతిక విలువలు, బాధ్యత, దేశభక్తి, మానవతా విలువలను పెంపొందించడం ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.
“ఒక మంచి ఉపాధ్యాయుడు ఒక విద్యార్థి భవిష్యత్తును మాత్రమే కాదు, ఒక కుటుంబం, ఒక సమాజం, ఒక దేశ భవిష్యత్తును కూడా ప్రభావితం చేయగలడు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారికి సరైన మార్గదర్శకత్వం అందించడమే ఉపాధ్యాయుల నిజమైన సేవ. విద్యార్థులు కష్టపడి చదివి, ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి. వారి విజయమే ఉపాధ్యాయులకు లభించే అసలైన గౌరవం” అని ప్రిన్సిపాల్ ఉయ్యాల వెంకటేశం అన్నారు.
ప్రస్తుత కాలంలో విద్యతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకత, క్రీడలు, యోగా, ఆరోగ్యం, నైతిక విలువలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులను సమగ్రంగా తీర్చిదిద్దేందుకు పాఠశాలలోని ప్రతి ఉపాధ్యాయుడు చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆర్. కరుణాకర్, జి. సబిత, పి. శ్రీనివాస్, వి. దొరతి, జి. మాధురి, పి. లింగస్వామి, డి. భవాని, కె. నాగమనీషా, ఎన్. వెంకటయ్య, మహమ్మద్ రజియుద్దీన్, బి. సూర్యకుమారి, టి. అనురాధ, బి. కోమలి, జె. విజయ, సాజిద, యాదయ్య, శంకర్, నసరత్, చంద్రమౌళి, సమతా, వెంకటరమణ, లక్ష్మీ, రామ్ నరేష్, శ్రీహరి, కొండల్ తదితర ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థులు ఉపాధ్యాయులను సన్మానిస్తూ నిర్వహించిన కార్యక్రమంతో పాఠశాలలో ఆత్మీయ, ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.


