నవపక్షం, దమ్మపేట, నవపక్షం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నల్లివారిగూడెం మెయిన్ రోడ్డు నుంచి గ్రామంలోకి వెళ్లే రహదారి అధ్వానంగా మారడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు నిర్మాణం కోసం గ్రావెల్ పోసినప్పటికీ, ఆ తర్వాత రోడ్డు పనులు పూర్తికాకపోవడంతో రహదారి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రహదారి మొత్తం గ్రావెల్‌తో ఉండటంతో ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనదారులు ప్రయాణించేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామం నుంచి వైద్య అవసరాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో కూడా తీవ్ర అవస్థలు ఎదురవుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. వాహనాల టైర్లు పంక్చర్లు కావడంతో పాటు, వాహనాలు అదుపుతప్పే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.
వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లే రైతులు సైతం ఈ రహదారిపైనే ఆధారపడాల్సి ఉండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు తెలిపారు. రహదారి పలు చోట్ల గోతులతో ఉండటంతో ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొందన్నారు.
రాత్రి వేళల్లో గోతులు స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదాల ముప్పు మరింత పెరుగుతోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం కురిసిన సమయంలో గోతుల్లో నీరు నిలిచిపోవడంతో రహదారి పరిస్థితి మరింత అధ్వానంగా మారుతోందని తెలిపారు.
గ్రామ ప్రజల రాకపోకలకు కీలకంగా ఉన్న ఈ రహదారిని అధికారులు పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి నాణ్యమైన రహదారి నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.


