ఘనపురం, నవపక్షం – ఘనపూర్ ప్రతినిధి:
కాకతీయుల కాలం నాటి చారిత్రక గణప సముద్రం ప్రస్తుతం వెలవెలబోతోంది. ఈ సమయానికి నిండుకుండలా ఉండాల్సిన చెరువు వర్షాభావ పరిస్థితులతో ఆశించిన స్థాయిలో నీటిని సంతరించుకోలేదు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గడంతో చెరువు మత్తడి మూగబోయింది.
ఒకప్పుడు గణప సముద్రం నిండిన వేళ మత్తడి నుంచి ఉరకలెత్తే జలధారలు మరో బొగత జలపాతాన్ని తలపించేవి. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో మత్తడి పరిసర ప్రాంతాలు పర్యాటకులను సైతం ఆకట్టుకునేవి. ప్రస్తుతం ఆ దృశ్యాలు కనుమరుగై మత్తడి వెలవెలబోతుండటం స్థానికులను కలచివేస్తోంది.
చెరువు నిండితే పరిసర ప్రాంతాల రైతులకు సాగునీరు అందడంతో పాటు భూగర్భజలాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది కూడా సమృద్ధిగా వర్షాలు కురిసి గణప సముద్రం నిండాలని రైతులు, స్థానికులు ఆకాంక్షిస్తున్నారు. చారిత్రక చెరువు పరిరక్షణకు అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.


