నవపక్షం, మొయినాబాద్ మండల ప్రతినిధి :
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని, ప్రజా జీవితంలో ఆయన 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మొయినాబాద్ మండలంలోని జేపీఎల్ కన్వెన్షన్‌లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అప్పిరెడ్డిగూడెం గ్రామ బీజేపీ అధ్యక్షుడు, రెండో వార్డు సభ్యుడు భవాని అనిల్ కుమార్ రక్తదానం చేశారు. ఆయనతో పాటు కే. ప్రవీణ్, సీహెచ్. శివ, సాయి, ముదిరాజ్ చరణ్ తదితరులు రక్తదానం చేసి సామాజిక సేవా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
ఈ సందర్భంగా భవాని అనిల్ కుమార్ మాట్లాడుతూ రక్తదానం ఎంతో విలువైన సామాజిక సేవా కార్యక్రమమని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి రక్తదాతలు అందించే సహాయం ఎంతో కీలకమని పేర్కొన్నారు. యువత రక్తదానానికి ముందుకు రావడం ద్వారా సమాజానికి సేవ చేయవచ్చని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ప్రజా సేవకు ప్రాధాన్యతనిస్తూ, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
రక్తదాన శిబిరంలో పాల్గొన్న ప్రతి రక్తదాతను నిర్వాహకులు అభినందించారు. రక్తదానం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సమాజానికి తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, యువత తదితరులు పాల్గొన్నారు.


