నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి :
రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్యను డా. ఎం.డి. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు మద్దతు తెలిపి, ఆశీస్సులు అందించాలని కోరారు.
ఈ సందర్భంగా పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, విద్యావంతుల హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సమస్యలకు శాసనమండలి వేదికగా ప్రాధాన్యత కల్పించి, పట్టభద్రుల తరఫున బలంగా గొంతు వినిపించాల్సిన అవసరం ఉందని వివరించారు.
అలాగే ప్రగతి ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సేవలను ఆర్. కృష్ణయ్యకు వివరించారు. సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతి, విద్యావంతులు మరియు నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపారు.
పట్టభద్రుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, వారి హక్కుల పరిరక్షణకు కృషి చేయాలనే సంకల్పంతో ఎన్నికల బరిలో నిలిచినట్లు డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి పేర్కొన్నారు.


