నవపక్షం, నకిరేకల్:
హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి NH-65పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని అటిపాముల గ్రామ శివారులో చెరువు అన్నారం ఎక్స్‌రోడ్డు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రుడు జొన్నలగడ్డ ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడు గ్రామానికి చెందిన జొన్నలగడ్డ వాసు, జొన్నలగడ్డ ప్రశాంత్ ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. మార్గమధ్యలో నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన గోగుల స్వాతి అనే మహిళకు లిఫ్ట్ ఇవ్వడంతో ఆమె కూడా వారితో కలిసి ప్రయాణించింది. ఈ క్రమంలో ముగ్గురూ ద్విచక్ర వాహనంపై చెరువు అన్నారం గ్రామం నుంచి జాతీయ రహదారిపైకి వస్తుండగా, హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ వేగంగా వచ్చి వారి వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్వాతి, జొన్నలగడ్డ వాసు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందగా, ద్విచక్ర వాహనంపై ఉన్న ప్రశాంత్ తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రమాదం జరిగిన తీరును క్షతగాత్రుడు జొన్నలగడ్డ ప్రశాంత్ వెల్లడించినట్లు తెలిసింది. ప్రమాద సమాచారం అందుకున్న సీఐ రాజశేఖర్, ఎస్సై క్రాంతి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన ప్రశాంత్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలు స్వాతి నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందినవారు కాగా, మరో మృతుడు జొన్నలగడ్డ వాసు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడు గ్రామానికి చెందిన వ్యక్తి. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.
ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


