మద్నూర్, నవపక్షం:
మండలంలోని అవల్గావ్ గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి గ్రామ ప్రజల నుండి విశేష స్పందన లభించింది.
గ్రామంలోని మాన హనుమాన్ మందిర్ షట్టర్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో నిజామాబాద్‌కు చెందిన 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన సీనియర్ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ వై. ప్రకాష్ గారు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు ముఖ్యంగా నరాల నొప్పులు, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు మరియు ఇతర దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న గ్రామస్థులను పరీక్షించి తగిన సలహాలు, సూచనలు అందించారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో వచ్చిన వారికి 3 రోజులకు సరిపడా నమూనా (శాంపూల్) మందులను ఉచితంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మన్య బాయి, ఉప సర్పంచ్ విజయ్, పంచాయతీ కార్యదర్శి సతీష్‌లతో పాటు వార్డు సభ్యులు బాలరాజు, ఖండు, సాయిలు, శంకర్ మరియు గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


