నవపక్షం, కొత్తగూడెం ప్రతినిధి :
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేపై బీజేపీ మతోన్మాద శక్తులు ప్రదర్శించిన దళిత వివక్షను నిరసిస్తూ కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ, సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. పాత బస్ డిపో సెంటర్ నుంచి రైల్వే స్టేషన్ సెంటర్ వరకు నిర్వహించిన నిరసన ర్యాలీ అనంతరం గాంధీ విగ్రహం వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.
ఈ కార్యక్రమానికి జిల్లా డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నాయకత్వం వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ, ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభ అనంతరం వేదికను గంగాజలంతో శుద్ధి చేయడం కేవలం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను అవమానించడం మాత్రమే కాదని, దేశంలోని దళితులు, బహుజనులు, పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలందరినీ అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాల్సిన సమయంలో కుల వివక్ష, అంటరానితనం వంటి భావజాలాన్ని ప్రోత్సహిస్తూ దేశాన్ని వెనక్కి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ మతోన్మాద శక్తులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. దళితులు, బడుగు బలహీన వర్గాల హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
అనంతరం డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న మాట్లాడుతూ, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తూ రాజ్యాంగ విలువలను అవమానిస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పతనం కాక తప్పదని విమర్శించారు. దళిత, బడుగు బలహీన వర్గాలకు చెందిన జాతీయ నాయకుల పట్ల బీజేపీ అనుసరిస్తున్న వివక్షాపూరిత వైఖరిని తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా కొత్తగూడెం గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక సమానత్వం, దళితుల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, మండల, గ్రామ, బూత్ స్థాయి నాయకులు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


