నవపక్షం, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి:
ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి, వారిని ఉన్నత లక్ష్యాల వైపు ప్రోత్సహించే ఉద్దేశంతో హైదరాబాద్–యాదగిరి టోల్వే ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో భువనగిరి KV స్కూల్లో INTERISE INSPIRE AWARDS 2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ గారు, IPS ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాలకు విచ్చేసిన ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ గారికి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా భువనగిరి, బీబీనగర్ పరిధిలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులకు INTERISE INSPIRE AWARDS అందజేశారు. విద్యార్థుల విద్యా ప్రతిభను గుర్తించి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు ఉన్నత లక్ష్యాల సాధనకు ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
అవార్డుల ప్రదానోత్సవం అనంతరం విద్యార్థులు తమ ప్రతిభ, సృజనాత్మకత, సాంస్కృతిక నైపుణ్యాలను చాటుతూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. విద్యార్థుల అద్భుతమైన ప్రదర్శనలు కార్యక్రమానికి హాజరైన వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ గారు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలను అభినందించారు. చదువుతో పాటు సాంస్కృతిక, క్రీడా మరియు ఇతర సహపాఠ్య కార్యక్రమాల్లోనూ విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని సూచించారు. అవార్డులు అందుకున్న విద్యార్థులను అభినందించడంతో పాటు, విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసి ప్రోత్సహిస్తున్న పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు మరియు కార్యక్రమ నిర్వాహకులను ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో DSP ప్రభాకర్ రెడ్డి గారు, భువనగిరి టౌన్ CI రమేష్ గారు, ట్రాఫిక్ CI మధుసుధన్ గారు, SIలు, ఇతర పోలీసు సిబ్బంది, KV స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
అనంతరం ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ గారు పాఠశాల ప్రాంగణంలోని వివిధ ప్రాంతాలను సందర్శించి విద్యార్థులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు, మౌలిక వసతులను పరిశీలించారు. పాఠశాల అధికారులతో మాట్లాడి విద్యార్థుల విద్యా, సమగ్ర అభివృద్ధికి అందిస్తున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు.
INTERISE INSPIRE AWARDS 2026 కార్యక్రమం విద్యా ప్రతిభను గుర్తించడంతో పాటు, విద్యార్థుల్లో దాగి ఉన్న సాంస్కృతిక ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించేందుకు, యువతను ఉన్నత లక్ష్యాల వైపు నడిపించేందుకు ఒక చక్కని వేదికగా నిలిచింది.


