నవపక్షం, ఎల్బీ నగర్ ప్రతినిధి :
ఎల్‌బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి శనివారం ఎస్‌ఎన్‌డీపీ పనుల్లో భాగంగా సాగర్ రింగ్ రోడ్డువద్ద జరుగుతున్న స్ట్రామ్ వాటర్ లైన్స్ నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్ట్రామ్ వాటర్ లైన్స్ పనుల కారణంగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టిన నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సాగర్ రింగ్ రోడ్డువద్ద నిర్మిస్తున్న స్ట్రామ్ వాటర్ లైన్స్‌ను బైరామల్‌గూడ చెరువువద్ద ఇప్పటికే నిర్మించిన స్ట్రామ్ వాటర్ డ్రైన్‌కు అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. ఈ పనులు సకాలంలో పూర్తయితే వర్షాకాలంలో వరద నీటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు కాలనీలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, వరద నీటి సమస్య నుంచి పూర్తిస్థాయిలో ఉపశమనం కలుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.






