నవపక్షం, వేములవాడ ప్రతినిధి : ఆగస్టు 29:
తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. వ్యవహారిక భాషోద్యమానికి ఆద్యుడు గిడుగు రామమూర్తి పంతులు, భారతదేశ గొప్ప హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు విక్కుర్తి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. “దేశభాషలందు తెలుగు లెస్స” అని శ్రీకృష్ణదేవరాయలు కీర్తించిన తెలుగు భాష ఎంతో మధురమైనదని అన్నారు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్‌గా ప్రసిద్ధి చెందిన తెలుగు భాషకు సుసంపన్నమైన చరిత్ర ఉందని, మన భావాలను వ్యక్తీకరించడంతో పాటు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంలో మాతృభాషకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు.
గ్రాంథిక భాషను సామాన్యులకు సులభంగా అర్థమయ్యే వ్యవహారిక భాషగా మార్చేందుకు గిడుగు రామమూర్తి పంతులు విశేష కృషి చేశారని కొనియాడారు. తెలుగు భాషను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
అదేవిధంగా మేజర్ ధ్యాన్ చంద్‌ను “హాకీ మాంత్రికుడు” గా పిలుస్తారని, హాకీ రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకుని శారీరక దృఢత్వాన్ని సాధించాలని సూచించారు. ప్రతిభగల క్రీడాకారులను ప్రభుత్వం మరింతగా ప్రోత్సహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దుర్శేటి లక్ష్మీనారాయణ, కంకెల్కార్ మోహన్, అంగన్వాడీ ఉపాధ్యాయురాళ్లు లిక్కిడి మంజుల, పులి శారద, విద్యార్థులు పాల్గొన్నారు.


