నవపక్షం, నకిరేకల్, ప్రతినిధి:
ఈ నెల 5న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నకిరేకల్ పర్యటన నేపథ్యంలో మినీ స్టేడియంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవర్, వివిధ శాఖల అధికారులు పరిశీలించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకుందని, గత విధ్వంస పాలన నుంచి రాష్ట్రం వికాసం వైపు సాగుతోందని అన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా నకిరేకల్‌లో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు.
గత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంపై రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారని ఎమ్మెల్యే విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగం, మూడెకరాల భూమి వంటి హామీలను గత ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. ప్రతిపక్ష నేత అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడలేదని, వారు సభకు హాజరుకాకపోవడంతో దళిత నేతకు ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కలేదని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని ఎమ్మెల్యే వేముల వీరేశం పిలుపునిచ్చారు. సభకు వచ్చే ప్రజల కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.


