నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :
నల్గొండ జిల్లా నాంపల్లి మండలం మల్లపురాజుపల్లి గ్రామానికి చెందిన శ్రీ వట్టికోటి రాములు–ఇందిర దంపతుల కుమార్తె వట్టికోటి వైష్ణవి ఇంటర్మీడియట్‌లో బైపీసీ గ్రూపులో 963 మార్కులు సాధించి ప్రతిభ చాటారు.
అనంతరం NEET-2026 పరీక్షలో 413 మార్కులు సాధించి ఆల్ ఇండియా స్థాయిలో 2,41,664వ ర్యాంకు, తెలంగాణ రాష్ట్ర స్థాయిలో 6,301వ ర్యాంకు, BC-A కేటగిరీలో 239వ ర్యాంకు సాధించారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు పొందారు.
మారుమూల ప్రాంతమైన నాంపల్లి మండలం మల్లపురాజుపల్లి గ్రామం నుంచి తొలిసారిగా ఒక విద్యార్థిని ఎంబీబీఎస్ సీటు సాధించడం గ్రామానికి ఎంతో గర్వకారణమని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. బీసీ వర్గానికి చెందిన విద్యార్థిని ప్రతిభతో మెడికల్ సీటు సాధించడం ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని తెలిపారు.
వైష్ణవి తల్లిదండ్రులు వృత్తిరీత్యా ఉద్యోగస్తులు. తండ్రి సిద్దిపేట జిల్లాలో ఏపీవోగా విధులు నిర్వహిస్తుండగా, తల్లి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం వారు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చనే దానికి వైష్ణవి విజయం నిదర్శనమని గ్రామస్తులు, బంధువులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వట్టికోటి వైష్ణవిని గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు అభినందించి, ఆమె భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి మంచి వైద్యురాలిగా సేవలందించాలని ఆకాంక్షించారు.


