నవపక్షం, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి :
యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసుల నిరంతర కృషితో CEIR (Central Equipment Identity Register) పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న, చోరీకి గురైన 100 మొబైల్ ఫోన్లను విజయవంతంగా రికవరీ చేశారు. రికవరీ చేసిన మొబైల్ ఫోన్ల విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
పౌరులు తమ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆయా పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న CEIR వారియర్ అధికారులు ఫిర్యాదుదారుల వివరాలను CEIR పోర్టల్లో నమోదు చేశారు. అనంతరం సంబంధిత మొబైల్ ఫోన్ల IMEI నంబర్ల ఆధారంగా నిరంతరం ట్రాకింగ్ చేపట్టారు.
CEIR వ్యవస్థను సమర్థవంతంగా వినియోగిస్తూ పోలీసు అధికారులు చేపట్టిన నిరంతర పర్యవేక్షణ, సాంకేతిక చర్యల ఫలితంగా Samsung, OnePlus, Vivo, Oppo తదితర ప్రముఖ బ్రాండ్లకు చెందిన 100 మొబైల్ ఫోన్లను తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి రికవరీ చేశారు.
రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ IPS వాటి అసలైన యజమానులకు స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ మరియు CCS ఇన్స్పెక్టర్ ప్రవీణ్ బాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ IPS మాట్లాడుతూ, మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న ప్రతి ఒక్కరూ వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, మొబైల్కు సంబంధించిన IMEI నంబర్ వివరాలను అందించాలని సూచించారు. CEIR పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేసేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
ప్రజల ఆస్తి, వ్యక్తిగత సమాచార భద్రతకు యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజలకు మెరుగైన పోలీసింగ్ సేవలు అందిస్తున్నామని ఎస్పీ తెలిపారు.


