నవపక్షం, నాంపల్లి, సెప్టెంబర్ 11:
నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించి, చీరలు నేస్తూనే విద్యాభ్యాసాన్ని కొనసాగించిన నర్సింగ్ భట్ల గ్రామానికి చెందిన వల్లకిర్తి జానకి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా సాధించి తన గ్రామానికి, కుటుంబానికి గర్వకారణంగా నిలిచారు.
నర్సింగ్ భట్ల గ్రామానికి చెందిన నిరుపేద చేనేత దంపతులు వల్లకిర్తి కొండయ్య, లక్ష్మమ్మల కుమార్తె అయిన జానకి, గట్లమల్లేపల్లికి చెందిన వింజమూరి శంకరయ్యను వివాహం చేసుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్సీ (జియాలజీ) పూర్తి చేసిన ఆమె, అనంతరం పరిశోధనలో ప్రవేశించారు.
సైంటిఫిక్ ఆఫీసర్ (ఎఎండి) డాక్టర్ జి. నాగేంద్రబాబు సూపర్వైజర్గా, ప్రొఫెసర్ పి. పాండురంగారెడ్డి కో-సూపర్వైజర్గా వ్యవహరించిన పరిశోధనలో “Geology and Geochemistry of Granite of Darsi, Prakasam District, Andhra Pradesh, South India” అనే అంశంపై పరిశోధనలు నిర్వహించి, పరిశోధన పత్రాలను సమర్పించారు.
సెప్టెంబర్ 8న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన 85వ కాన్వొకేషన్ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్, ఉస్మానియా విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శివ్ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. ఈ ఘట్టం తన విద్యా ప్రయాణంలో మరపురాని మైలురాయిగా నిలిచిందని జానకి తెలిపారు.
ఈ సందర్భంగా జానకి మాట్లాడుతూ, తన తల్లిదండ్రులు, అన్నయ్య ఇచ్చిన ప్రోత్సాహంతో చీరలు నేస్తూనే బీఎస్సీ విద్యను పూర్తి చేశానని తెలిపారు. వివాహం అనంతరం కూడా తన భర్త వింజమూరి శంకరయ్య అందించిన ప్రోత్సాహం, సహకారంతో ఎం.ఎస్సీతో పాటు డాక్టరేట్‌ను పూర్తి చేయగలిగానని చెప్పారు. తన విజయానికి తన భర్త అందించిన ప్రోత్సాహమే ప్రధాన కారణమని ఆమె పేర్కొన్నారు.
చేనేత కుటుంబం నుంచి వచ్చిన జానకి పట్టుదలతో విద్యను కొనసాగించి డాక్టరేట్ సాధించడం గ్రామీణ ప్రాంత మహిళలకు, ముఖ్యంగా చేనేత కుటుంబాల ఆడబిడ్డలకు స్ఫూర్తిదాయకమని పలువురు అభినందించారు


