నవపక్షం, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :
రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి అధ్యక్షతన జిల్లా యువజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి, రాష్ట్ర ఇంచార్జ్ ఖాలీద్, సహాయ ఇంచార్జ్ భవ్య హాజరయ్యారు.
ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని వివిధ నియోజకవర్గాల్లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, సంస్థాగతంగా యువజన కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై నాయకులకు దిశానిర్దేశం చేశారు.
సమావేశంలో జక్కిడి శివ చరణ్ రెడ్డి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. రాబోయే రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి యువజన కాంగ్రెస్ శ్రేణులు చురుకుగా పనిచేయాలని, ముఖ్యంగా ఓటరు నమోదు కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పార్టీ అభ్యర్థులుగా ఎవరిని ప్రకటించినా పార్టీ నిర్ణయానికి అనుగుణంగా సమష్టిగా పనిచేసి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు, జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్ నేతృత్వంలో యువజన కాంగ్రెస్ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన సూచించారు. ఈ నెల 29న హైదరాబాద్‌లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో జాతీయ యువజన కాంగ్రెస్ ఇంచార్జ్ మణిశర్మ ముఖ్య అతిథిగా గిగ్ వర్కర్ల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి రంగారెడ్డి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
జిల్లా పరిధిలోని నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు యువతకు సంబంధించిన సమస్యలపై నిరంతరం పోరాటాలు, కార్యక్రమాలు చేపట్టాలని నాయకులకు సూచించారు.
ఈ సమావేశంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు లక్ష్మీకాంత్, గుర్రం శ్యామ్ చరణ్ రెడ్డి, నియోజకవర్గాల అధ్యక్షులు మహిపాల్ యాదవ్, మహేశ్ గౌడ్, సికిందర్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


