నవపక్షం, మర్రిగూడ మండల ప్రతినిధి :
మండలంలోని మెదిచంద్రాపురం పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి “మెంటరింగ్ బై ఎమినెంట్ ఎక్స్పర్ట్స్ – ఇంటర్నేషనల్ అండ్ నేషనల్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు ప్రముఖ నిపుణుల అనుభవాలు, జ్ఞానం, మార్గదర్శకత్వాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మహబూబ్‌నగర్ బి.ఈడీ కళాశాలలో సైకాలజీ లెక్చరర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన డాక్టర్ బురుగుల రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా డాక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో చదువుతో పాటు మానసిక వికాసం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సానుకూల ఆలోచనా విధానం ఎంతో ముఖ్యమని అన్నారు. విద్యార్థులు తమలోని ప్రతిభను గుర్తించి, నిర్దిష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని సూచించారు.
విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడి, సందేహాలు, అపజయాలను చూసి నిరుత్సాహపడకుండా వాటిని అనుభవాలుగా తీసుకోవాలని తెలిపారు. తమపై తమకు నమ్మకం, సమయపాలన, ఏకాగ్రత, మంచి అలవాట్లు విజయానికి దోహదపడతాయని వివరించారు. విద్యార్థులు తమ భవిష్యత్ విద్య, కెరీర్ ఎంపికల విషయంలో ముందుగానే అవగాహన పెంచుకోవాలని సూచించారు.
అలాగే ఉపాధ్యాయులు విద్యార్థులలోని ప్రతిభను గుర్తించి వారికి తగిన మార్గదర్శకత్వం అందించాలని, పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత వంటి అంశాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఉయ్యాల వెంకటేశం మాట్లాడుతూ పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వివిధ రంగాల్లో నిపుణుల మార్గదర్శకత్వం అందించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు కొత్త విషయాలను తెలుసుకోవడంతో పాటు తమ భవిష్యత్ లక్ష్యాలపై స్పష్టత ఏర్పడేందుకు దోహదపడతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆర్. కరుణాకర్, జి. సబిత, పి. శ్రీనివాస్, వి. దొరతి, జి. మాధురి, పి. లింగస్వామి, డి. భవాని, కె. నాగమనీషా, ఎన్. వెంకటయ్య, మహమ్మద్ రజియుద్దీన్, బి. సూర్యకుమారి, టి. అనురాధ, బి. కోమలి, జె. విజయ, సాజిద, యాదయ్య, శంకర్, నసరత్, చంద్రమౌళి, సమతా, వెంకటరమణ, లక్ష్మీ, రామ్ నరేష్,కొండల్ తదితర ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.ప్రముఖ నిపుణుడి సూచనలు, సలహాలతో కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా సాగింది.


