నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి :
మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి మండలం నిజాంపేట ప్రగతి నగర్ రాజీవ్ గృహకల్పలో శివ గణేష్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుని నిమజ్జనోత్సవం సందర్భంగా బుధవారం నిర్వహించిన గణేష్ లడ్డూ వేలం పాట ఘనంగా జరిగింది.
ఈ వేలం పాటలో మొదటి పెద్ద లడ్డూను రూ.55,000లకు జ్యోతి గురువయ్య కైవసం చేసుకున్నారు. రెండో లడ్డూను రూ.42,000లకు కమల–నాగరాజు దంపతులు దక్కించుకున్నారు. అలాగే లాటరీ ద్వారా నిర్వహించిన లడ్డూను బిందు–హనుమంతు దంపతులు కైవసం చేసుకున్నారు.
ఈ సందర్భంగా జ్యోతి గురువయ్య మాట్లాడుతూ, “వినాయకుని లడ్డూను మేము మూడోసారి దక్కించుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. బొజ్జ గణపయ్య ఆశీస్సులతో కాలనీ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన శివ గణేష్ యూత్ సభ్యులకు నా ప్రత్యేక ధన్యవాదాలు” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో శివ గణేష్ యూత్ సభ్యులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


