నవపక్షం, అందోల్ ప్రతినిధి :
అందోల్ నియోజకవర్గం పరిధిలోని డాకూర్ గ్రామంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గ్రామంలోని నవచైతన్య యూత్ ఆధ్వర్యంలో శ్రీ దుర్గాభవాని అమ్మవారి పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. నవచైతన్య యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు 11వ వార్షికోత్సవానికి చేరుకోవడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా నవచైతన్య యూత్ సభ్యులు మాట్లాడుతూ, యువత అంతా ఐక్యంగా ముందుకు వచ్చి ప్రారంభించిన అమ్మవారి పూజా కార్యక్రమాలను వరుసగా 11 ఏళ్లుగా విజయవంతంగా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులు, గ్రామ ప్రజల సహకారంతో ప్రతి ఏడాది ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
లోకకల్యాణం కోసం, గ్రామ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నవచైతన్య యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ దుర్గాభవాని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తుల రాకతో డాకూర్ గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.


