నవపక్షం, ఆందోల్ ప్రతినిధి:
అందోల్ నియోజకవర్గ పరిధిలోని డాకూర్ గ్రామంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నవచైతన్య యూత్ ఆధ్వర్యంలో శ్రీ దుర్గాభవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమం నవచైతన్య యూత్ 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ.. యువత అంతా ఐక్యంగా ముందుకు సాగుతూ అమ్మవారి పూజా కార్యక్రమాలను ప్రారంభించి, విజయవంతంగా 11వ వార్షికోత్సవానికి చేరుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గత 11 ఏళ్లుగా అమ్మవారి ఆశీస్సులతో, గ్రామ ప్రజల సహకారంతో ప్రతి సంవత్సరం ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. లోకకల్యాణం కోసం, గ్రామ ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నవచైతన్య యూత్ సభ్యులతో పాటు గ్రామ పెద్దలు, భక్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తుల రాకతో డాకూర్ గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.


