నకిరేకల్, నవపక్షం ప్రతినిధి:
అన్నదానం మహాదానమనే స్ఫూర్తితో నకిరేకల్ పట్టణంలోని గోల్డ్ మార్కెట్లో శనివారం శ్రీ యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ మహాలక్ష్మి జ్యువెలరీ యజమానులు రాచకొండ సవేందర్–సరిత దంపతులు అన్నదాన దాతలుగా వ్యవహరించారు.
శ్రీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాతల సహకారంతో భక్తులకు, స్థానికులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఆకలితో ఉన్నవారికి అన్నం అందించడం, అవసరంలో ఉన్నవారికి అండగా నిలవడం వంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవత్వాన్ని, సేవాభావాన్ని పెంపొందిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు.
వ్యాపార రంగంలో రాణిస్తూనే సామాజిక సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తున్న రాచకొండ సవేందర్–సరిత దంపతులను స్థానికులు అభినందించారు. యువత సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం సమాజ అభ్యున్నతికి దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడ్డారు.


