నవపక్షం, వేముల ప్రతినిధి :
వేముల మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి నాగెళ్ల సత్యప్రభావతమ్మ చేపట్టిన ఇంటింటి ప్రచార కార్యక్రమం అపూర్వ ప్రజాదరణతో ఉత్సాహభరితంగా సాగింది. బుధవారం ఉదయం నుంచే చాగలేరు, గుండ్లపల్లి, దుగ్గన్నగారిపల్లె, అమ్మాయగారిపల్లె మరియు గొల్లలగూడూరు గ్రామాల్లో ఆమె విస్తృతంగా పర్యటించారు.
ఈ పర్యటనలో స్థానిక నాయకులు పవన్ విశ్వేశ్వర్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, హరినాథ్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డిలతో కలిసి సత్యప్రభావతమ్మ ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, వృద్ధులు మరియు యువత ఆమెకు హారతులు పడుతూ ఘన స్వాగతం పలికారు.
గ్రామాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా వైఎస్సార్సీపీ పనిచేస్తోందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ‘ఫ్యాన్’ గుర్తుపై ఓటు వేసి, సత్యప్రభావతమ్మను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ స్థాయి నాయకులు, వైఎస్సార్సీపీ శ్రేణులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.


