నవపక్షం, వేముల ప్రతినిధి :
వేముల మండల పరిధిలోని వేల్పుల, బేస్తావారిపల్లి గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి నాగేళ్ల సత్య ప్రభావతమ్మ ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు. వైకాపా మండల కన్వీనర్ నాగేళ్ల సాంబశివరెడ్డి సతీమణి అయిన ఆమె గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను నేరుగా కలుసుకుని ఆశీస్సులు, మద్దతు కోరారు.
ఈ సందర్భంగా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో నాగేళ్ల విశ్వేశ్వర్ రెడ్డి, నాగేళ్ల హర్షవర్ధన్ రెడ్డి, నాగేళ్ల హరినాథ్ రెడ్డిలు పాల్గొని అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
అభ్యర్థికి ముఖ్య నాయకుల మద్దతు
ఈ ప్రచార కార్యక్రమానికి వైకాపా మండల పరిశీలకులు లింగాల రామలింగారెడ్డి (వేల్పుల రాము), మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగాల ఉషారాణి, వేల్పుల మాజీ సర్పంచ్ లింగాల పార్వతమ్మ తదితర ముఖ్య నాయకులు హాజరై నాగేళ్ల సత్య ప్రభావతమ్మకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా మండల పరిశీలకులు లింగాల రామలింగారెడ్డి మాట్లాడుతూ, నాగేళ్ల కుటుంబం ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునే కుటుంబమని పేర్కొన్నారు. మండల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తూ, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే నాయకత్వం అవసరమని, అలాంటి అర్హతలు కలిగిన నాగేళ్ల సత్య ప్రభావతమ్మను ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో వేల్పుల, బేస్తావారిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.


