వికారాబాద్ జిల్లా, ఆగస్టు 15:
జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS ఆదేశాల మేరకు జిల్లాలో నిబంధనల ఉల్లంఘనలపై టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక నిఘా కొనసాగిస్తోంది.
ఇందులో భాగంగా టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్.కె. అన్వార్ పాషా ఆధ్వర్యంలో బంట్వారం మండలం బోపనారం గ్రామ పరిధిలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో తాండూర్‌కు ఆటోలో తరలిస్తున్న సుమారు 4 క్వింటాళ్ల కల్తీ, కుళ్లిపోయిన బెల్లాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆటోలో ఉన్న చంద్ పాషా, డ్రైవర్ మొహమ్మద్ కుతుబొద్దీన్‌లను విచారించగా, వారి దుకాణంలో కూడా కల్తీ, కుళ్లిపోయిన బెల్లం నిల్వ ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆటోలో తరలిస్తున్న బెల్లంతో పాటు దుకాణంలో నిల్వ ఉన్న బెల్లాన్ని కలిపి మొత్తం 7,500 కిలోల కల్తీ, కుళ్లిపోయిన బెల్లాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న బెల్లాన్ని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం బంట్వారం పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్.కె. అన్వార్ పాషా మాట్లాడుతూ.. “ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే కల్తీ వ్యాపారాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వం. కల్తీ, కుళ్లిపోయిన ఆహార పదార్థాల నిల్వలు, రవాణాపై నిఘాను మరింత కట్టుదిట్టం చేస్తాం. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.
కల్తీ ఆహార పదార్థాల విక్రయం, నిల్వ లేదా రవాణాకు సంబంధించిన సమాచారం తమ దృష్టికి వచ్చిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు సూచించారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.


