దమ్మపేట – నవ పక్షం:-
దమ్మపేట: -భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పెద్దగొల్లగూడెం గ్రామంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలన ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామ్ రెడ్డి, అశ్వారావుపేట శాసనసభ్యులు జార ఆదినారాయణ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న భోజనం, వంటగది, సరుకుల నిల్వ గది, పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు.
తనిఖీల్లో వంటగదిలో అన్నం సరిగా ఉడకకపోవడం, నిర్ణయించిన ఆహార పట్టిక ప్రకారం వంటలు చేయకపోవడం వంటి లోపాలు బయటపడ్డాయి. అంతేకాకుండా మధ్యాహ్నం తయారు చేసిన చారునే సాయంత్రం తిరిగి వేడిచేసి విద్యార్థులకు అందిస్తున్నట్లు గుర్తించారు. దీంతో ప్రజాప్రతినిధులు సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుళ్లిపోయిన కూరగాయలు గుర్తింపు
సరుకుల నిల్వ గదిని పరిశీలించగా తీవ్ర అపరిశుభ్రతతో పాటు విద్యార్థులకు వంట చేసేందుకు నిల్వ ఉంచిన కూరగాయలు కుళ్లిపోయి ఉండటాన్ని గుర్తించారు. విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ ఇలాంటి నిర్లక్ష్యం ఎలా జరిగిందంటూ సిబ్బందిని ప్రశ్నించారు.
అనంతరం విద్యార్థులతో నేరుగా మాట్లాడిన ఎంపీ, ఎమ్మెల్యేలు రోజువారీ ఆహార పట్టిక, భోజనం నాణ్యత, అందుతున్న ఆహారంపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్నీ సహించబోమని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ రామసహాయం రఘురామ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడితే ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆశ్రమ పాఠశాలలో పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన భోజనం అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. నిబంధనలు పాటించకుండా విద్యార్థులకు నాసిరకం ఆహారం అందించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం, పౌష్టికాహారం కోసం భారీగా నిధులు ఖర్చు చేస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వాటి అమలు సక్రమంగా జరిగేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.
- తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల శ్రేయస్సు కోసం కోట్ల రూపాయలు వెచ్చించి విద్యార్థినీ విద్యార్థులకు బంగారు బాటలు వేయాలనే సంకల్పంతో పయనిస్తుంటే పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై నాసిరకం, కుళ్ళిన కూరగాయలతో విద్యార్థినిలకు భోజనాలను వండి పెడుతున్నారని విద్యార్థినీల తల్లిదండ్రులు గొల్లగూడెం గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తూ ప్రభుత్వ సంక్షేమనికి తూట్లు పొడుస్తున్నారని ప్రజలు బహుబాటంగానే చర్చించుకుం
టున్నారు


