నవపక్షం ప్రతినిధి, చౌటుప్పల్ /
అక్టోబర్ 01:
నేలపట్ల గ్రామపంచాయతీలో సర్పంచ్ వసంత భర్త నాగేష్ గ్రామపంచాయతీ పరిపాలనలో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలపై, అందుకు సర్పంచ్ వసంత ప్రోత్సహిస్తున్నారనే అంశంతో గ్రామ ఉపసర్పంచ్ చిన్నం బాలరాజు, వార్డు సభ్యులు సమర్పించిన ఫిర్యాదుపై డీఎల్పీవో ప్రతాప్ నాయక్ ఈరోజు నేలపట్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో విచారణ నిర్వహించారు.
ఈ విచారణకు సర్పంచ్ గంగాపురం వసంత, సర్పంచ్ భర్త గంగాపురం నాగేష్, ఉపసర్పంచ్‌తో పాటు అన్ని వార్డు సభ్యులు హాజరయ్యారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలకు సంబంధించి డీఎల్పీవో ప్రతాప్ నాయక్ అందరి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
విచారణ సందర్భంగా గ్రామపంచాయతీ పరిపాలనలో సర్పంచ్, సర్పంచ్ భర్త నాగేష్ పాత్ర, సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల బాధ్యతలు, పరిపాలనలో పారదర్శకత, సమన్వయం తదితర అంశాలపై డీఎల్పీవో పలు సూచనలు చేశారు.
ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను పూర్తిగా పరిశీలించి విచారణ నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని, తదుపరి చర్యలు నిబంధనల ప్రకారం తీసుకుంటామని తెలిపారు.
గ్రామపంచాయతీ పరిపాలన ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా, పారదర్శకంగా, సమన్వయంతో సాగాలని పాలకవర్గానికి సూచించారు. గ్రామపంచాయతీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.


