నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి:
ఎన్నో ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపకుండా, 22A నిషేధిత భూముల జాబితా పేరుతో రైతులు, భూ యజమానులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్‌ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు ఉప్పు కృష్ణ ఆరోపించారు.
అసైన్డ్, సీలింగ్ భూములకు పట్టాలు లేకపోయినా ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబాలు, తమ అవసరాల కోసం భూమిని కొనుగోలు చేయడం, విక్రయించడం వంటి విషయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పిల్లల ఉన్నత చదువులు, కుటుంబ అవసరాలు, ఆడపిల్లల వివాహాలు వంటి అవసరాల కోసం భూమిపై ఆధారపడుతున్న కుటుంబాలకు ప్రస్తుత పరిస్థితులు సమస్యగా మారాయని పేర్కొన్నారు.
భూ సమస్యలకు పరిష్కారం చూపాల్సిన రెవెన్యూ వ్యవస్థలోని ప్రక్రియల కారణంగా రైతులు ఏండ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆయన అన్నారు. ధరణి అమలుకు ముందు కొత్త చట్టం ద్వారా భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అధికారులు చెప్పినప్పటికీ, ధరణి అమల్లోకి వచ్చిన తరువాత అనేక సమస్యలకు తగిన పరిష్కార మార్గాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.
భూభారతి–ROR చట్టం 2025 ఏప్రిల్ 14 నుంచి అమల్లోకి వచ్చినప్పటికీ, గతంలో ఉన్న అనేక రెవెన్యూ సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని ఉప్పు కృష్ణ అన్నారు. చట్టం అమలు ప్రారంభంలో గ్రామస్థాయిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించినప్పటికీ, వాటిలో అనేక సమస్యలకు ఇప్పటికీ పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు. దరఖాస్తుదారుల్లో కొంతమందికి ఇప్పటికీ అధికారుల నుంచి స్పష్టమైన సమాధానాలు అందలేదని అన్నారు.
ఆర్డీవో స్థాయిలో రెవెన్యూ కోర్టుల ఏర్పాటు వంటి నిబంధనలు ఆచరణలో సమర్థవంతంగా అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సాదా బైనామాలు, కోర్టు కేసులు, వాయిదాలు వంటి అంశాల కారణంగా రైతులు రెవెన్యూ కార్యాలయాలు, న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉందని అన్నారు.
గతంలో రెవెన్యూ రికార్డుల్లో జరిగిన తప్పిదాల కారణంగా నేటికీ రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం సమస్యపై ఫిర్యాదు చేసినప్పుడు గతంలో ఏం చేశారని రైతులను ప్రశ్నించడం సరికాదని, గతంలో జరిగిన రికార్డు లోపాలను కూడా పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని అన్నారు.
రెవెన్యూ రికార్డుల్లో జరిగిన తప్పిదాల భారాన్ని రైతులపై మోపకుండా, సంబంధిత రికార్డులను సమగ్రంగా పరిశీలించి భూ సమస్యలకు న్యాయబద్ధమైన పరిష్కారం చూపాలని ఆయన కోరారు.
22A నిషేధిత భూముల జాబితాపై సమగ్ర పునఃపరిశీలన చేపట్టాలని, అర్హత ఉన్న భూముల విషయంలో నిబంధనల ప్రకారం రైతులకు వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే అసైన్డ్, సీలింగ్ భూముల విషయంలో సంబంధిత భూపరిమితి చట్టాలు, అసైన్డ్ భూముల నిబంధనలను పరిగణనలోకి తీసుకుని అర్హులైన రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇక పంట నమోదు, ఆన్‌లైన్ భూ వివరాలు, పంట కొనుగోలు సమయంలో OTP సమస్యలు, యూరియా బుకింగ్ తదితర అంశాల్లో కూడా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయానికి సంబంధించిన సేవలను సులభతరం చేసి, రైతులకు సాంకేతికంగా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
రెవెన్యూ శాఖకు భూ సమస్యల పరిష్కారంతో పాటు జనాభా లెక్కలు, కుల గణన, ఓటర్ల నమోదు తదితర అనేక కార్యక్రమాలను అప్పగించడం వల్ల సిబ్బందిపై పనిభారం పెరిగి భూ సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతున్న పరిస్థితిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని ఉప్పు కృష్ణ కోరారు.
భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించి, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను కాలపరిమితిలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, రైతులకు పారదర్శకంగా సమాచారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


