నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి :
డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయాలంటూ తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు ఉప్పు కృష్ణ డిమాండ్ చేశారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కోసం నిర్వహించిన పాదయాత్రను ప్రారంభించిన సందర్భంగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై కోదండరాం చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల సాగునీటి అవసరాల నేపథ్యంలో అభ్యంతరకరంగా ఉన్నాయని ఉప్పు కృష్ణ అన్నారు. ఈ వ్యాఖ్యలపై పునరాలోచించి వాటిని ఉపసంహరించుకోవాలని కోరారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు ప్రాంతాల్లో సాగునీటి సమస్యల పరిష్కారానికి డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కీలకమని, ఫ్లోరోసిస్ ప్రభావిత ప్రాంతాలకు సాగు, తాగునీటి వనరుల అభివృద్ధి అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన పనులను పూర్తి చేసి, అవసరమైన కాలువలు, చెరువులు తదితర నీటి పంపిణీ వ్యవస్థలను అభివృద్ధి చేసి రైతులకు సాగునీరు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సాగునీటి కోసం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్న సమయంలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా సాగునీటి సమస్యలపై ప్రజా ప్రతినిధులు స్పందించి పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని ఉప్పు కృష్ణ అన్నారు.
డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయాలన్న కోదండరాం అభిప్రాయంపై దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు, భువనగిరి, నల్గొండ పార్లమెంట్ సభ్యులు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు తమ వైఖరిని స్పష్టంగా వెల్లడించాలని ఆయన కోరారు.
దేవరకొండ, మునుగోడు ప్రాంతాల్లో సాగునీటి సమస్యలతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను పూర్తి చేయడంతో పాటు, ప్రాజెక్టు ద్వారా లభించే నీటిని కాలువలు, చెరువుల ద్వారా అర్హత ఉన్న ఆయకట్టుకు అందించే విధంగా సమగ్ర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజల సాగునీటి అవసరాల కోసం మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కోదండరాం, అదే విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల సాగునీటి అవసరాలు, సమస్యలపై కూడా దృష్టి సారించాలని ఉప్పు కృష్ణ కోరారు.
డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, నీటి పంపిణీ, రైతుల ప్రయోజనాలపై రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు చర్చించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


