భూపాలపల్లి, ఆగస్టు 9 (నవపక్షం జిల్లా ప్రతినిధి – బండారి తిరుపతి): ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని, రైతులను ఆదుకునేందుకు దేవాదుల ప్రాజెక్టు నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికే సాగు చేసిన పంటలకు సరిపడా నీరు అందకపోవడంతో పంటలు వాడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దేవాదుల ప్రాజెక్టు నుంచి తక్షణమే నీటిని విడుదల చేయాలని కోరారు. ముఖ్యంగా రామప్ప సరస్సు నుంచి గణపురం చెరువుకు గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేసి చెరువును నింపాలని సూచించారు.
గణపురం చెరువుకు నీరు అందితే పరిసర ప్రాంతాల్లోని రైతులకు సాగునీటి భరోసా కలుగుతుందని అన్నారు. ప్రభుత్వం పరిస్థితిని గుర్తించి ఆలస్యం చేయకుండా తక్షణ చర్యలు చేపట్టాలని గండ్ర వెంకట రమణారెడ్డి డిమాండ్ చేశారు.






