నవపక్షం, భూపాలపల్లి బ్యూరో, ఆగస్టు 09: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు బీఎన్ సంతోష్ (IAS), జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ (IAS), ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వట్సల్ టొప్పో (IAS) ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో అధికారికంగా కార్యక్రమాలను నిర్వహించారు.
మహదేవపూర్‌లోని ఐటీడీఏ కార్యాలయ సముదాయంలో ఆదివాసీ నాయకులు, గిరిజన ప్రజలు, విద్యార్థుల సమక్షంలో ఆదివాసీ పోరాట వీరుడు స్వర్గీయ కొమురం భీమ్ శిలా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం గిరిజన సంప్రదాయాల నడుమ ఆదివాసీల జెండాను ఆవిష్కరించారు.
జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ నివాళులు
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో స్థానిక శాసనసభ్యులు శ్రీ గండ్ర సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆదివాసీ నాయకులతో కలిసి కొమురం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో గిరిజన ప్రజలు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, ఆదివాసీ నాయకులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: డీటీడీఓ నాగసాగర్
ఈ సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి శ్రీ గొట్టిముక్కుల నాగసాగర్ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని తెలిపారు.
గిరిజనులు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఆదివాసీ సమాజం హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకుంటూ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.






