నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్దీపన ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, పుష్పగిరి ఆస్పత్రి సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత నేత్ర శస్త్ర చికిత్స శిబిరాన్ని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పుష్పగిరి ఆస్పత్రి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా నకిరేకల్ నియోజకవర్గ ప్రజలకు ఉచిత కంటి వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. కంటి పరీక్షలు నిర్వహించి, శస్త్ర చికిత్స అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయడంతో పాటు, ఆపరేషన్ అనంతరం ఉచితంగా కంటి అద్దాలను కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు..
గత ఏడాది సుమారు 1,000 మందికి ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించినట్లు ఎమ్మెల్యే అన్నారు..
ఈ ఏడాది కూడా సేవలను మరింత విస్తరించేందుకు నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో ప్రతి మండలంలో నాలుగు రోజుల పాటు ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని శాలిగౌరారం మండలంలో ఎమ్మెల్యే మందుల సామేలు సహకారంతో ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించేందుకు కృషి చేస్తామని వేముల వీరేశం అన్నారు..
కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను కొనసాగిస్తామని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలు ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు…






