నవపక్షం, మర్రిగూడ, సెప్టెంబర్ 3:
మర్రిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గత కొన్ని రోజులుగా ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహిస్తున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మండల స్థాయి క్రీడోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. మర్రిగూడ మండల విద్యాశాఖాధికారి జి. శారద అధ్యక్షతన ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.
మండలంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ తదితర క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని, అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులు, జట్లకు బహుమతుల ప్రదానోత్సవం నిర్వహించారు.
ఈ క్రీడోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు కుదాబక్ష్‌పల్లి పాఠశాల స్కూల్ అసిస్టెంట్ పి. రవీందర్ రావు, ఆయన సోదరుడు ప్రేమేందర్ రావు సంపూర్ణ ఆర్థిక సహాయాన్ని అందించారు. విజేతలకు అందించిన బహుమతులను సైతం వారు తమ సొంత ఖర్చులతో ఏర్పాటు చేసి విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని నింపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల క్రీడా వికాసానికి ముందుకు వచ్చిన దాతల ఉదారతను విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రూప్ సింగ్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు రామతులసి, పీఎం శ్రీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఉయ్యాల వెంకటేశం, కేజీబీవీ ఎస్‌ఓ జ్యోతి మాట్లాడారు. చదువుతో పాటు క్రీడలు విద్యార్థుల మానసిక, శారీరక దృఢత్వానికి ఎంతో దోహదపడతాయని, క్రీడాస్ఫూర్తితో గెలుపోటములను సమానంగా స్వీకరించాలని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో క్రీడల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు వాసుదేవరావు, జంగయ్య, నరసింహ, వేదవతి, రామ్ నరేష్,కళావతి, పవన్‌తో పాటు వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.


