దమ్మపేట, నవ పక్షం మండల ప్రతినిధి :
దమ్మపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను దమ్మపేట మండల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు, రాజకీయ సంస్కృతికి విరుద్ధంగా ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్మపేట మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కక్కిరాల రమేష్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా మాట్లాడాల్సిన ప్రజాప్రతినిధులు వ్యక్తిగత విమర్శలు, అనుచిత వ్యాఖ్యలకు పాల్పడటం సరికాదన్నారు. రాజకీయ భేదాలు ఉన్నప్పటికీ పరస్పర గౌరవం, హుందాతనం, ప్రజాస్వామ్య సంప్రదాయాలను ప్రతి నాయకుడు పాటించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపై విమర్శలు చేయాలనుకుంటే విధానాలపై మాట్లాడాలని, వ్యక్తిగతంగా అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయడం తగదని కాంగ్రెస్ నాయకులు హితవు పలికారు. తాతా మధు తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
ఈ ప్రెస్‌మీట్‌లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిన్నశెట్టి యుగంధర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్నశెట్టి చిట్టిబాబు, పగడాల రాంబాబు, మండల ప్రధాన కార్యదర్శి వనమాల శ్రీనివాసరావు, కెవి సత్యనారాయణ అత్తులూరి వెంకటరామారావు చిన్న శెట్టి గోపి, పానుగంటి లక్ష్మణ్ తదితర సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


