నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి :
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో విజయవాడ రహదారి విస్తరణలో భాగంగా చేపడుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కోరుతూ టీఆర్‌ఎస్ పార్టీ చౌటుప్పల్ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్, 5వ వార్డు కౌన్సిలర్ కొయ్యడ శేఖర్ ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా కొయ్యడ శేఖర్ మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతుండటంతో చౌటుప్పల్ పట్టణ ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నిర్మాణ పనుల్లో భాగంగా జాతీయ రహదారి–65పై రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో సర్వీస్ రోడ్లపై ట్రాఫిక్ పెరిగిందన్నారు. దీంతో ద్విచక్ర వాహనదారులు ఫుట్‌పాత్‌లను వినియోగించాల్సి వస్తోందని, పాదచారులు రోడ్డు దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ట్రాఫిక్ రద్దీ కారణంగా అత్యవసర వైద్యం కోసం వెళ్లే వాహనాలు సైతం ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిడ్జి నిర్మాణం కారణంగా చిన్నచిన్న వ్యాపారాలపై ఆధారపడే కుటుంబాలు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు.
కావున బ్రిడ్జి నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడంతో పాటు, ప్రజలు సురక్షితంగా రోడ్డు దాటేందుకు తాత్కాలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ప్రమాదాల నివారణకు అవసరమైన చోట్ల హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆర్డీవోకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ దామోదర్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు తాడూరి పరమేష్, గ్రంథాలయ చైర్మన్ మల్లేష్ గౌడ్, అంకిరెడ్డిగూడెం సర్పంచ్ సర్వే మల్లేష్ గౌడ్, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మండల పార్టీ అధ్యక్షుడు నిరంజన్ గౌడ్, చౌటుప్పల్ మున్సిపాలిటీ కన్వీనర్ బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి, 15వ వార్డు కౌన్సిలర్ గడ్డం ఇందిరా రాజరత్నం, 4వ వార్డు కౌన్సిలర్ యాదయ్య, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.


