నవపక్షం, భూపాలపల్లి, సెప్టెంబర్ 12 :
సామాజిక న్యాయంలో భాగంగా యాదవులకు సముచిత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి, తెలంగాణ రాష్ట్రంలో యాదవులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ, రాజకీయ ప్రాతినిధ్యం, అధికార భాగస్వామ్యంలో తమకు తగిన స్థానం దక్కడం లేదని జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి భూపాలపల్లి జిల్లా యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాడవేన రాకేష్ యాదవ్ అన్నారు. యాదవులు రాష్ట్ర అభివృద్ధిలో తను వంతు పాత్ర పోషిస్తున్నారని, పశుపోషణ, వ్యవసాయం, పాల ఉత్పత్తి వంటి రంగాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా సేవలందిస్తున్నారని తెలిపారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన యాదవ సామాజిక వర్గానికి రాష్ట్ర మంత్రివర్గంలో సముచిత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, అన్ని వర్గాలకు రాజకీయ భాగస్వామ్యం అనే లక్ష్యాలకు అనుగుణంగా యాదవ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు రాకేష్ యాదవ్ తెలిపారు, మంత్రి పదవి అనేది కేవలం ఒక వ్యక్తికి ఇచ్చే పదవి కాదని, యాదవ సమాజానికి లభించే రాజకీయ గౌరవం, ప్రాతినిధ్యం, అధికార భాగస్వామ్యానికి ప్రతీక అని పేర్కొన్నారు.


