నవపక్షం, నల్లగొండ జిల్లా ప్రతినిధి :
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. శుక్రవారం నకిరేకల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని, ప్రజా సమస్యలపై దృష్టి సారించాల్సిన ప్రభుత్వం రాజకీయ విమర్శలకే ప్రాధాన్యత ఇస్తోందని ఆయన ఆరోపించారు.
నల్గొండ జిల్లాకు రావాల్సిన సాగునీటి విషయంలో అన్యాయం జరుగుతోందని, ఇతర ప్రాంతాలకు నీటిని తరలించడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లింగయ్య ఆరోపించారు. పంటలు ఎండిపోకుండా AMRP పరిధిలోని చెరువులు, కుంటలను వెంటనే నీటితో నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నకిరేకల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, దళితులపై పోలీసు కేసుల విషయంలో రాజకీయ జోక్యం ఉందని ఆయన ఆరోపించారు. పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా చట్టప్రకారం, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు.
నల్గొండ జిల్లాకు సాగునీటి కేటాయింపులు, రైతుల సమస్యలపై బీఆర్ఎస్ తరఫున ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని చిరుమర్తి లింగయ్య తెలిపారు.


