నవపక్షం, తొర్రూరు ప్రతినిధి :
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, కుటుంబాలకు భరోసా కల్పిస్తామన్న హామీలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆయన ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ తొర్రూరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కాలం గడుస్తున్నప్పటికీ ఎన్నికల హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ, ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నినాదాలు చేశారు.
ప్రజల పక్షాన బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని, ఎన్నికల హామీల అమలయ్యే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగిస్తామని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.


