నవపక్షం, పరకాల నియోజకవర్గం ప్రతినిధి : నడికుడ మండలం కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న బస్సు యాత్ర పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం నడికుడ మండలంలోని రాయపర్తి, పులిగిల్ల, చర్లపల్లి, నార్లాపూర్, వరికోల్ గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు.
కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షులు పోశాల అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో, ఆయా గ్రామాల గౌడ సంఘం సొసైటీ అధ్యక్షులు మార్క బాబన్న, పాలకుర్తి శంకర్ గౌడ్, తాళ్లపల్లి సతీష్, బోనగాని సంతోష్, పోశాల రమేష్ అధ్యక్షతన ఈ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు రమణ గౌడ్ ఆధ్వర్యంలో చేపడుతున్న బస్సు యాత్రకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరకాల నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆముదాలపెల్లి మల్లేశం గౌడ్ హాజరై పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మల్లేశం గౌడ్ మాట్లాడుతూ, గౌడ సొసైటీలకు ప్రతి గ్రామంలో కనీసం 5 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించాలని, ఆ భూముల్లో తాటి, ఈత వనాలను పెంచుకునేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అలాగే కల్లుగీత కార్మికులకు పెన్షన్లు, ప్రమాద బీమా, ఎక్స్‌గ్రేషియా, మోటార్ వాహనాలు అందించాలని, పెండింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రేషియా బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ బస్సు యాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన నార్లాపూర్ గ్రామ సర్పంచ్ పెద్దబోయిన రవీందర్కు కల్లుగీత కార్మిక సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా నాయకులు బండి సదానందం గౌడ్, మార్క రఘుపతి గౌడ్, పోశాల సమ్మయ్య, పరకాల మండల ప్రధాన కార్యదర్శి గునిగంటి బుచ్చి రాములు, మండల ఉపాధ్యక్షులు శ్రీధర్తో పాటు ఆయా గ్రామాలకు చెందిన కల్లుగీత కార్మికులు, గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.






