నవపక్షం, దమ్మపేట ప్రతినిధి: దమ్మపేట జిల్లా పరిషత్ హైస్కూల్‌లో 1989–90 సంవత్సరాల్లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం దమ్మపేటలోని స్థానిక వాసవి క్లబ్ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థి షేక్ ఖాసిం అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.
కార్యక్రమంలో తొలుత దమ్మపేట మండల కేంద్రానికి చెందిన జీసీసీ హమాలీ కార్మికుడు భోగిం సత్యంను ఘనంగా సన్మానించారు. కూలి పనులు చేస్తూనే తన ముగ్గురు కుమార్తెలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది, తండ్రిగా విజయాన్ని సాధించిన సత్యం సేవలను పూర్వ విద్యార్థులు అభినందించారు.
ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ, దమ్మపేటలో విద్యను అభ్యసించిన తనను గుర్తించి, స్థానిక విద్యావంతులను గౌరవిస్తూ సన్మానించిన షేక్ ఖాసిం, 1989–90 పదో తరగతి పూర్వ విద్యార్థులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని, సుమారు 36 సంవత్సరాల క్రితం నాటి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. పాఠశాల రోజుల్లో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకుంటూ ఆనందంగా గడిపారు. అనంతరం మహిళా పూర్వ విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశారు.
ఏళ్ల తర్వాత తమ పాత మిత్రులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. విద్యార్థి దశలో ఏర్పడిన స్నేహబంధాలు కాలం గడిచినా చెక్కుచెదరకుండా ఉండటం ఈ సమ్మేళనం ద్వారా మరోసారి రుజువైందన్నారు.
ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు జటా వల్లభుల రాజ్యలక్ష్మి, భానుమతి, ధారా వెంకటేశ్వర్ రావు, ధారా వెంకట రామారావు, మారం సుబ్బారావు, ఖండవల్లి యుగంధర్, బుర్రి సత్యనారాయణ, ప్రసాద్, ఆంజనేయులు, శ్రీను, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.






