నవపక్షం, వైరా నియోజకవర్గ ప్రతినిధి :
ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచి నేటికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలం కొమ్ముగూడెంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ తండాల్లో తమ రాజ్యం రావాలని, తమ నాయకులే తమకు నాయకులుగా ఉండాలని గిరిజనులు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేసినప్పటికీ గత పాలకులు పట్టించుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం తండాలు, గూడేలను గ్రామపంచాయతీలుగా మార్చి గిరిజనుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిందని పేర్కొన్నారు.
పోడు భూములకు పట్టాలు అందించడంతో పాటు ఎస్టీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి గిరిజన విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేశారని రాకేష్ రెడ్డి అన్నారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేసిందని తెలిపారు.
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించాలని అన్నారు.
బంజారులు, ఆదివాసీలు కేసీఆర్‌ను ఎప్పటికీ గుండెల్లో పెట్టుకోవాలని రాకేష్ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే గిరిజన, ఆదివాసీ ప్రజల సంక్షేమం, హక్కులు, అభివృద్ధికి మరింత ప్రాధాన్యత లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గిరిజన సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

